దేశంలో అధిక రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. ఫలితంగా 12 రాష్ట్రాల్లో అంధకారం అలముకుంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రోజుకు 8 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా యూపీ, ఏపీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 70 శాతం వాటా బొగ్గు నుంచే వస్తుంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటుతుండడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతోందని తెలుస్తోంది.
మరో 9 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని అఖిల భారత విద్యుత్తు ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే వెల్లడించారు. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం 26 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకుంటాయి. దీంతో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత అక్టోబర్‌లో భారీ వర్షాలకు దేశంలోని ప్రధాన బొగ్గు క్షేత్రాల్లోకి నీట మునిగాయి. దీంతో వర్షం నీరు కారణంగా బొగ్గు వెలికితీత ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంపైన మాత్రమే కేంద్రం దృష్టిసారించిందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశాల నుంచి 2.5 కోట్ల టన్నుల బొగ్గు మాత్రమే భారత్ దిగుమతి చేసుకుంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 50 శాతం దిగుమతులు తగ్గాయి. ఈ పరిస్థితులే విద్యుత్ సంక్షోభానికి దారి తీశాయి.