ఇటీవలి కాలంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేతలతో తరుచూ కలుస్తున్న ఆయన కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలో పొత్తులు ఉన్నట్లు తెలుస్తోంది.ఏపీలో వైసీపీతో పొత్తు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ అంశాన్ని మీడియా ఏపీ మంత్రి గుడివాడ అమరనాథ్ వద్ద ప్రతిపాదించినప్పుడు ఆయన ఘాటుగా స్పందించారు. పొలిటికల్ స్ట్రాటజిస్టులు కొన్ని స్ట్రాటజీలు చెబుతారని, అయితే వాటిని అమలు చేయాలా వద్దా అనేది ఆయా పార్టీల అధ్యక్షుల నిర్ణయమని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ చెప్పినవన్నీ తాము చేస్తామనే ఆలోచన విడనాడాలన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా వైసీపీని వైఎస్ జగన్ స్థాపించారని, అలాంటిది తిరిగి ఆ పార్టీతో ఎలా కలుస్తామని ప్రశ్నించారు.