పసిపిల్లలు ఆడిస్తూ, వారిని సంరక్షించాల్సిన ఓ అంగన్‌వాడీ ఆయా క్రూరంగా ప్రవర్తించింది. అమ్మకావాలని ఏడుస్తున్న బాలుడి మూతిపై వాతలు పెట్టింది. దీంతో భయపడిపోయిన ఆ మూడేళ్ల బాలుడు అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. అయినప్పటికీ వెంటపడి కొట్టుకుంటూ తిరిగి అంగన్‌వాడీ కేంద్రానికి ఆయా తీసుకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని అనంతపురం నగరం కోవూరునగర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఎప్పటిలాగే తన మూడేళ్ల బాలుడు ఈశ్వర్‌కృష్ణను గురువారం ఆమె తల్లి లక్ష్మి తీసుకెళ్లింది. కొద్ది సేపటికి ఆ బాలుడికి అమ్మ గుర్తు వచ్చింది. దీంతో ఏడుపు లంకించుకున్నాడు. ఆ చిన్నారిని బుజ్జగించాల్సిన ఆయా కోపంతో ఊగిపోయింది. ఏడుపు ఆపాలని చెప్పినా బాలుడు ఆగలేదు. దీంతో బాలుడి మూతిపై ఆయా వాతలు పెట్టింది. దీంతో మూతి కాలిన ఆ బాలుడు మరింత బిగ్గరగా ఏడుస్తూ పారిపోవాలని చూశాడు. కొంత దూరం వెళ్లిపోయిన ఆ బాలుడిని చెట్టు కొమ్మ విరిచి కొట్టుకుంటూ ఆయా తిరిగి తీసుకొచ్చింది. ఈ ఘటనపై బాలుడి తల్లి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకిలా ప్రవర్తించావని అడిగితే ఆయా ఆమెపై తిరగబడింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.