జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వంలోని వైసీపీ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు కాదని చంద్రబాబు వదిలిన విల్లు అని మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. దీనిని ఓర్వలేకే పవన్, చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. పవన్ పర్యటనలో జై జగన్ నినాదాలు వస్తున్నాయని చెప్పారు. దీనిని గమనించి ప్రజల్లో వైసీపీకి ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలుసుకోవాలన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా పవన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు కోసం ఆయన వద్ద కాపు కులాన్ని పవన్ తాకట్టు పెట్టారని చెప్పారు. చంద్రబాబుకు ఏదైనా కష్టం వస్తే పవన్ రంగంలోకి దిగుతారన్నారు. పవన్ వెంట కాపులు వెళ్లొద్దన్నారు. ఇదిలా ఉండగా కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేనాని పవన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం తన పర్యటనలో భాగంగా వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందిస్తూ మంత్రులు తాజా వ్యాఖ్యలు చేశారు.