ఆగ్నేయ నైజీరియాలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో శనివారం పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా మరణించారని, చాలా మంది గాయపడ్డారని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య 100 కంటే ఎక్కువ ఉండవచ్చని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయని, అక్రమ ముడి చమురు శుద్ధి కర్మాగారంలోని రెండు ఇంధన నిల్వ ప్రాంతాలకు త్వరగా వ్యాపించాయని తెలుస్తోంది. దీనివల్ల కాంప్లెక్స్ ప్రాంతంలో మంటలు వేగంగా వ్యాపించాయని ఎల్‌ఎమ్‌ఓ స్టేట్ కమిషనర్ డెక్లాన్ ఎమెలుంబా చెప్పారు. పేలుడుకు గల కారణాలు, మృతులపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు భయం గొల్పుతున్నాయి. కాలిపోయిన ప్రజల అవశేషాలు, అస్థిపంజరాలు దర్శనమిస్తున్నాయి.