సమాజంలో రోజురోజుకూ విలువలు పతనమవుతున్నాయి. మద్యం చాలా కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యం కోసం ఏకంగా కుటుంబ సభ్యులనే మత్తులో హత్య చేస్తున్నారు కొందరు. తాజాగా ఇదే కోవలో ఓ యువకుడు విచక్షణ కోల్పోయి తనకు జన్మనిచ్చిన తల్లిని చంపేశాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా జాసిపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో హటపడియా గ్రామం ఉంది. ఆ గ్రామంలో శాలందీ నాయక్(55) అనే మహిళ తన కుమారుడు సరోజ్‌ను ఎంతో గారాబంగా పెంచింది. చిన్నప్పటి నుంచి ఏం అడిగినా కొనిచ్చేది. ఇక పెరిగి పెద్దైన తర్వాత సరోజ్ మద్యానికి అలవాటు పడ్డాడు. ప్రతిరోజూ గొంతులోకి సారా చుక్క పడనిదే అతడు ఉండలేకపోయేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సారా కొనుక్కునేందుకు అతడి వద్ద డబ్బులు లేవు. తల్లి వద్దకు వచ్చి రూ.100 అడిగాడు. ఇంతకు ముందే తాగావని, మరలా మరలా తాగొద్దని తల్లి అతడికి హితవు పలికింది. ఆమె మంచి మాటలు సరోజ్ చెవికెక్కలేదు. డబ్బులు కోసం మరింత పట్టుబట్టాడు. ఆమె లేవని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని తల్లి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. తల్లి మరణించడంతో అతడికి మత్తు దిగింది. అక్కడి నుంచి పరారయ్యాడు. శనివారం పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.