ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమాన్ చాలీసా వివాదం ముదిరింది. మహారాష్ట్రలో హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసాను పఠించాలని నిరసనలు వెల్లువెత్తాయి. సీఎం హనుమాన్ చాలీసా పఠించకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులు తమను అరెస్టు చేయడం పట్ల నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెప్పామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం ఇంటి ముందు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినిపించుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ముంబైలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.