ప్రభుత్వాసుపత్రిలో తాడిపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి బెంగుళూరు వారిచే ఏర్పాటు చేయాలనుకున్న ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఉన్నఫలంగా రద్దు చేయడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
కోనలో ఓ వివాహానికి వెళుతుండగా మండుటెండలో వృద్ధులు పడుతున్న అగచాట్లను గమనించిన జె. సి అక్కడికి వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. శంకర ఆసుపత్రిలో కిడ్నీలు తీసుకుంటున్నారని, ఆపరేషన్ వికటించిందని, దీనికి తోడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి, బొంబాయి రమేష్ అనుమతి లేకపోవడంతో రద్దు చేసినట్లు స్థానికులు జె. సికి తెలిపారు. విషయం తెలుసుకున్న జె. సి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతలు ముందుకొచ్చి ఉచితంగా ఏర్పాటు చేసే వాటికి కూడా ఎమ్మెల్యే అనుమతి వుండాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై వడుగులు చేస్తే, జెంజకం వేసుకుంటే కూడా ఎమ్మెల్యేది, బొంబాయిది అనుమతి తీసుకోవాలేమో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ తొ నడుస్తున్న శంకర కంటి ఆసుపత్రి అతిపెద్దదని, ఎన్నో అవార్డులు పొందిందని దీనిపై లేనిపోని అభాండాలు వేయడం తగదని బొంబాయి రమేష్ పై జె. సి మండిపడ్డారు. అలాంటప్పుడు ముందుగానే వృద్ధులకు సమాచారం ఇవ్వాలని, ఇక్కడికి వచ్చాక లేదంటే ఎలా అన్నారు. అనంతరం వారిని వారి గమ్యాలకు చేర్చాలని స్థానిక నాయకులను జె. సి ఆదేశించారు. దీంతో వెంటనే మాజీ ఎంపిపి రంగయ్య, రుద్రమనాయుడు, బొట్టు శేఖర్లు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వృద్ధులను వారి గ్రామాలకు తరలించారు.