ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుమ్మడికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 12:25 PM

గుమ్మడికాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో బీటా కెరొటిన్​ పుష్కలంగా ఉంటుందని తెలిపారు. బీటా కెరొటిన్‌ తో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ఐరన్‌, ఫోలేట్‌ కూడా గుమ్మడిలో ఎక్కువగా ఉంటాయి.


 గుమ్మడికాయలో ఎక్కువగా ఉండే బీటా కెరొటిన్‌ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్‌ ఎ రూపంలోకి మారిపోతుంది. అరకప్పు గుమ్మడి ముక్కలతోనే మనకు రోజుకు అవసరమైన విటమిన్‌ ఏ లభిస్తుంది. కళ్లు బాగా కనబడటానికి, పునరుత్పత్తి అవయవాలు సజావుగా పనిచేయటానికి విటమిన్‌ ఏ చాలా అవసరం. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి సైతం ఇది దోహదం చేస్తుంది. కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పు తగ్గటానికి కూడా విటమిన్‌ ఎ తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుమ్మడికాయల్లో విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ఐరన్‌, ఫోలేట్‌ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి.


గుమ్మడి ముక్కల్లోని పొటాషియం రక్తపోటు తగ్గటంలోనూ సాయపడుతుంది. ఫలితంగా పక్షవాతం ముప్పూ తగ్గుముఖం పడుతుంది. ఎముక సాంద్రత కూడా మెరుగవుతుంది. గుమ్మడి గింజల్లోనూ బోలెడన్ని ఖనిజాలుంటాయి. కొలెస్ట్రాల్‌ మాదిరి వృక్ష స్టెనాల్స్‌ కూడా ఎక్కువే. ఇవి మంచి కొవ్వు స్థాయులు పెరిగేలా చేస్తాయి. గుమ్మడిలో పీచు ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది. సెరటోనిన్‌ నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com