ఉక్రెయిన్ విషయంలో రాజీలేని యుద్దానికి సిద్దమైన రష్యా అవసరమైతే అణ్వస్త్రాలను కూడా ప్రయోగించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి అసలైన ముప్పు ఇప్పుడు ప్రారంభం కాబోతోందని రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలను పంపే విషయమై తన మిత్ర దేశాలతో అమెరికా ఈరోజు సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికే పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్ కు భారీ ఎత్తున ఆయుధాలు, యుద్ధ సామగ్రి అందాయి. వీటితోనే రష్యా సేనలను ఉక్రెయిన్ నిలువరించే ప్రయత్నం చేస్తోంది. పెద్ద సంఖ్యలో రష్యా యుద్ధ విమానాలు, ట్యాంకర్లను ధ్వంసం చేసింది. వేలాది మంది రష్యా సైనికులను చంపేసింది. ఇప్పుడు భారీ ఎత్తున ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపాలని అమెరికా, పశ్చిమ దేశాలు డిసైడ్ అయ్యే పరిస్థితి రావడంతో అణ్వస్త్ర దేశమైన రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రష్యన్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని వార్నింగ్ ఇచ్చారు. 'ఇది ముమ్మాటికీ నిజం. మా హెచ్చరికలను తక్కువగా అంచనా వేయొద్దు' అని అన్నారు.
తమకు శక్తిమంతమైన ఆయుధాలను ఇవ్వాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అడుగుతున్నారు. జెలెన్ స్కీ అడుగుతున్న వాటిలో యుద్ధ విమానాలు, భారీ ఫిరంగులు వంటివి ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ కు 700 మిలియన్ డాలర్ల సాయం అందిస్తామని అమెరికా ప్రకటించింది. మరోవైపు నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఫైటర్ జెట్లను, యుద్ధ సామగ్రిని అందిస్తున్నాయి.
ఇప్పుడు ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలను పంపే దిశగా అమెరికా అడుగులు వేస్తుండటం రష్యాకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. యుద్ధం తీవ్రంగా మారుతుందని హెచ్చరించింది. అసలైన మూడో ప్రపంచ యుద్ధం దగ్గరపడిందని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పరిస్థితి చేజారే పరిస్థితే వస్తే... అణ్వస్త్రాలను వాడటానికి కూడా రష్యా వెనకడుగు వేయకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.