ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022: నేడు రాజస్థాన్ తో తలపడనున్న బెంగళూరు

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 04:32 PM

రాయల్స్ జట్ల మధ్య రసవత్తర క్రికెట్ యుద్దం జరగనుంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ప్రతీకార పోరుకు రంగం సిద్దమైంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బెంగుళూరు విజయం సాధించడంతో..ఈ మ్యాచ్లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ కసితో ఆడనుండగా, ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి రాజస్థాన్ పై ఆధిపత్యాన్ని కొనసాగించాలని బెంగుళూరు చూస్తోంది.


రాజస్థాన్ జట్టు పరంగా బలంగా కనిపిస్తోంది. గత రెండు మ్యాచుల్లో శాంసన్ సేన బ్యాటింగ్, బౌలింగ్ లో ఇరగదీశారు. ఈ నేపథ్యంలో అదే టీమ్ తోనే బరిలోకి దిగొచ్చు. ఓపెనర్లుగా బట్లర్ , దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత మిడిలార్డర్ లో కెప్టెన్ సంజూ శాంసన్, హిట్ మేయర్, రియాన్ పరాగ్ ఆడతారు. లోయర్ ఆర్డర్ లో కరుణ్ నాయర్, ఆర్. అశ్విన్, మెక్ కే రావచ్చు. బౌలింగ్ లో దారుణంగా విఫలమవుతున్న మెక్ కే స్థానంలో జేమ్స్ నీషమ్ తుది జట్టులో ఉండే ఛాన్సుంది. లేదా కెప్టెన్ అతనిపై నమ్మకముంచి మెక్కేనే కొనసాగించవచ్చు. బౌలింగ్ లో బౌల్ట్, ప్రసిద్దకృష్ణ, స్టార్ స్పిన్నర్లు చాహల్, అశ్విన్ ఆడటం పక్కా. రాజస్థాన్ ఆడిన చివరి మూడు మ్యాచుల్లో గుజరాత్ చేతిలో తప్ప కోల్కతా, ఢిల్లీపై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వారిలోకాన్ఫిడెంట్ మరింత పెరిగింది.


హైదరాబాద్ చేతిలో దారుణంగా ఓడిపోయిన బెంగూళూరు ఈ మ్యాచ్లో స్వల్ప మార్పులతో బరిలోకి దిగొచ్చు. కెప్టెన్ గా, బ్యాట్సమన్ గా డు ప్లెసిస్ కిరాక్ గా ఆడుతున్నాడు. అయితే తరుచూ విఫలమవుతున్న అనుజ్ రావత్ ప్లేస్ లో మహిపాల్ లామ్రార్ ను ఓపెనర్ గా ఆడించే అవకాశం లేకపోలేదు. ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లి ఆడటం ఖాయం. కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. ఈ సీజన్లో కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పటి వరకు ఆడింది లేదు. కానీ కోహ్లీ ఫాంలోకి వస్తే మాత్రం అతన్ని ఆపడం రాజస్థాన్ వల్ల కాదు. ఇక ఫోర్త్ ప్లేస్ లో మాక్స్ వెల్ ఆడనున్నాడు. 5వ స్థానంలో సుయాన్ష్ ప్రభుదేశాయ్ రానున్నాడు. మొదట్లో బాగానే ఆడిన ప్రభుదేశాయ్ ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్లో అయినా చెలరేగాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. ఇక లోయర్ ఆర్డర్ లో దినేష్ కార్తీక్ , షాబాజ్ అహ్మద్, హసరంగా తుదిజట్టులో ఉంటారు. హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, హేజిల్ వుడ్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. హర్షల్, సిరాజ్ బౌలింగ్ లో బెటర్ గా కనిపిస్తున్నా, హేజిల్ వుడ్ మాత్రం ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు.


రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచులు జరిగాయి. ఇందులో బెంగుళూరు 13, రాజస్థాన్ 10 మ్యాచుల్లో గెలిచాయి. మరో 3 మ్యాచుల్లో ఫలితం రాలేదు. చివరగా ఆడిన ఆరు మ్యాచుల్లో డుప్లెసిస్ సేన ఐదింటిలో గెలవగా, రాజస్థాన్ ఒకే గేమ్ ను విజయం సాధిచింది. ఓవరాల్ గా ఈ సీజన్లో రాజస్థాన్ ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడగా, ఐదింటిలో గెలిచి రెండింటిలో ఓడింది. మొత్తంగా 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3వ ప్లేస్ లో కొనసాగుతోంది. అటు బెంగుళూరు 8 మ్యాచులు ఆడితే ఐదింటిలో గెలిచి , మూడు పరాజయాలతో 10 పాయింట్లు సాధించి 5వ ప్లేస్ లో ఉంది.


రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 200 కంటే ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. అటు బెంగుళూరు మొదట బ్యాటింగ్ చేస్తే మాత్రం 180 కంటే ఎక్కువ పరుగులు చేస్తే బెంగుళూరుకు గెలుపు అవకాశాలు ఉంటాయి.


రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్న మ్యాచ్ కు పూణేలోని ఎంసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. అలాగే పేస్ కు, స్పిన్ కు కూడా సహకరిస్తుంది. పిచ్ పై అత్యధిక స్కోరు 210 కాగా అత్యల్ప స్కోరు 128 పరుగులు. ఆవరేజ్ స్కోరు 150 రన్స్. ఇక్కడ ఆరు మ్యాచులు జరిగితే మూడింటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిస్తే..మూడింటిలో ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. టాస్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఈ ఐపీఎల్ లో ఈ పిచ్పై ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడి అందులో విజయం సాధించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com