రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందిస్తుంటే ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ సంక్షేమ పథకాలను అడ్డుకునే కుట్ర చేస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి విమర్శించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మీ సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తోడుగా ఉండాలని కోరారు. అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న విద్యుత్ కళాభారతిలో మంగళవారం సున్నా వడ్డీ సంబరాలు నిర్వహించారు. 1294 మహిళా సంఘాలకు సంబంధించి రూ. 2 కోట్ల మెగా చెక్‌ను అందజేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే అనంతతో పాటు డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, విజయభాస్కర్‌రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మెప్మా పీడీ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట రామి రెడ్డి మాట్లాడుతూ ఇన్నాళ్లూ వంటింటికే పరిమితమైన మహిళలు నేడు కుటుంబాన్ని పోషించే స్థాయికి ఎదుగుతున్నారన్నారు. మహిళ అంటే ఆదిశక్తి అంటారని, అలాంటి వారిని ప్రోత్సహించడానికి, ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. మూడేళ్ల క్రితం అధికారంలో ఉన్న చంద్రబాబు మహిళలను మోసం చేశారని అన్నారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీని ఎగ్గొడితే ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రూ. 3600 కోట్లను జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. మరో రెండేళ్ల పాటు సున్నా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.
45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు వైఎస్‌ఆర్ చేయూత కింద ఏటా రూ. 18500 అందిస్తున్నామని చెప్పారు. అగ్రవర్ణాల్లోని వారికి కూడా ఏటా రూ. 15 వేలు అందిసున్నామన్నారు.
ఈ ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని కోరారు. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం అయ్యే పరిస్థితులు ఉండేవని, కానీ మూడేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 15 వేలు అందిస్తున్నామన్నారు. ఉన్నత విద్యకు ఆటకం రాకుండా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. చదువు కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదని, చదువు సంస్కారం నేర్పుతుందని చెప్పారు. తన తండ్రి లాయర్‌గా పని చేశారని, రాజకీయాల్లోనూ కొనసాగారని ఎమ్మెల్యే అనంత గుర్తు చేశారు. పిల్లలను బాగా చదివించాలన్న ఆలోచన రావడం వల్లే తానీ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. పిల్లల ఉజ్వల భవిష్యత్ అనేది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుందన్నారు.
కోవిడ్ పరిస్థితులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దని తెలిపారు. మాట తప్పిన చంద్రబాబుకు. మాట తప్పని జగన్‌కు మధ్య తేడాను మీరే గుర్తించాలన్నారు. నిరాటంకంగా పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులమయం అయ్యిందంటూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. నాయకులు కరపత్రాలతో మీ ఇళ్ల వద్దకు వస్తున్నారు. వారిని ఒక్కటే అడగండి. ప్రభుత్వం మంచి చేయడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించాలని అన్నారు మీకోసం పని చేసే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లుతుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉందన్నారు.
తమ స్వార్థానికి ఉపయోగించుకునే నాయకులకు ప్రజలు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపైనా దుష్ప్రచారం జరుగుతోందని, ఈ పథకాలన్నీ చంద్రబాబే తెచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.