మే 7, 8వ తేదీల్లో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏర్పాటు చేసి మెగా జాబ్ మేళా పోస్టర్లను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డిలతో కలిసి విజయసాయిరెడ్డి జాబ్‌మేళా పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం శ్రీ వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 'మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చదువుకుని ఒక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్కని అవకాశాన్ని అందిస్తుందన్నారు. పదవ తరగతి నుండి పీజీ వరకూ మీ మీ విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు పొందే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరూ ఆయా తేదీలలో నిర్వహించబడుతున్న జాబ్ మేళా లో పాల్గొని, మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, తద్వారా రేపటి మీ బంగారు భవిష్యత్ నిర్మాణానికి బాటలు వేయాలని సూచించారు. ముఖ్యంగా ఈ చక్కని అవకాశాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వినియోగించుకుని అడుగులు ముందుకు వేయాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.