చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రదర్శన ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఎంత మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఆడిన ఎనిమిది మ్యాచ్ లకు గాను ఆరింటిలో ఓటమి పాలైంది. జట్టులో ఒక్కరూ పెద్దగా రాణించింది లేదు. ఊతప్ప ఒక్క మ్యాచ్ లో, రాయుడు ఒక్క మ్యాచ్ లో రాణించారు. సుమారు 22-23 మంది ఆటగాళ్లు ఉన్నా.. ఎక్కువ మందిని బెంచ్ పై ఉంచుతోంది తప్పించి వారిలో ఒక్కొక్కరిని ఆడించే ప్రయత్నం చేయడం లేదు.
ముఖ్యంగా అండర్ 19 ప్రపంచకప్ విజయంలో పాల్గొన్న రాజ్ వర్ధన్ హంగర్గేకర్ ను రూ.1.5 కోట్లు చెల్లించి సీఎస్కే తీసుకుంది. మరి బెంచ్ పై ఎందుకు కూర్చోబెడుతోంది? అన్న అసహనం అభిమానుల్లోనూ వ్యక్తమవుతోంది. దీనిపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. యువ టాలెంట్ విషయంలో తాము ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు.
‘‘అతడు (రాజ్ వర్ధన్) అండర్ 19 స్థాయిలో మంచి ప్రదర్శన చేశాడన్నది నాకు తెలుసు. కానీ ఇది ఒక మెట్టు మాత్రమే. అతడు ప్రదర్శించాల్సిన నైపుణ్యాల పట్ల మాకు అవగాహన ఉంది. ఏదో విధంగా అతడిని ముందుకు నెట్టేసి, దెబ్బతింటే చూడాలని కోరుకోవడం లేదు. అతడికి ఉన్న సామర్థ్యాలను నిర్ధారించుకోవాలని అనుకుంటున్నాం.
అతడు ఇప్పటికే పెద్ద మ్యాచ్ లు ఆడాడు. ఈ ఏడాది అవకాశం వస్తే అతడిని రంగంలోకి దింపుతాం. పేస్ అన్నది ఒక విషయం. పెద్ద వేదికపై ఎలా బౌల్ చేయాలన్నది ముఖ్యం. చుట్టూ ఉన్న అతడి లాంటి ప్రతిభ కలిగిన ఆటగాళ్లను చూసి గందరగోళానికి గురికావడం లేదు’’ అని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన ఫ్లెమింగ్ చెప్పాడు. సీఎస్కే తదుపరి మే 1న సన్ రైజర్స్ తో తలపడనుంది.