ఏపీలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం గ్రామంలో వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్ హత్యకు గురయ్యాడు. ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. మాటా మంతి పెరగడంతో గ్రామస్థులు ఎమ్మెల్యే పై దాడిచేశారు. పరిస్థితి ఉద్రిక్తం మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
జి.కొత్తపల్లిలో రెండు వైసీపీ వర్గాలు ఉన్నాయి. ప్రసాద్ ఒక వర్గం నేత. దీంతో తమకు ఎదురుగా ఉన్న వర్గమే ప్రసాద్ ను హత్య చేసిందని ఓ వర్గం వారు భావించారు. ఎమ్మెల్యే కూడా ఆ వర్గానికి మద్దతుదారుగా ఉండడంతో, ప్రసాద్ వర్గం వైసీపీ నేతలు ఎమ్మెల్యే పై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యేని రక్షించి స్కూలు వద్దకు తరలించారు. అక్కడ కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు స్కూల్ చుట్టు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అదనపు బలగాలతో గ్రామానికి చేరుకున్నాడు.