ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలలో గురువారం కలకలం సృష్టించిన దొంగ నోట్ల మార్పిడి వ్యవహారం మలుపు తిరిగింది. పోలీసులు హత్యాయత్నంగా కేసు నమోదు చేశారు. ఈనాడు వెబ్ సైట్ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దొంగనోట్ల మార్పిడి ముఠా, గుంటూరు జిల్లాకు చెందిన కొందరికి అసలు నోట్లకు రెట్టింపు నోట్లు ఇస్తామని ఆశ చూపింది. నోట్లు మార్చుకునేందుకు గురువారం ఇరువర్గాలు పుట్రేల వచ్చాయి. కట్లలో రెండు వైపులా అసలు నోట్లు, మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి మోసగించాలని సత్తుపల్లికి చెందిన వ్యక్తులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంలో దొరికిన వారిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ముగ్గురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు విస్సన్నపేట ఎస్సై పి.కిశోర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండులపల్లికి చెందిన తోట హనుమంతరావును, గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి శశికిరణ్, జాని రత్నబాబు, ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన పదుమల్లి గణేష్ పుట్రేల వద్ద అడ్డగించి, హత్యాయత్నం చేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తుల్లో ఓ ప్రజాప్రతినిధికి చెందిన బంధువు ఉన్నట్లు ప్రచారం సాగడంతో ఈ వ్యవహారానికి ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి, సాధారణ వ్యక్తిపై హత్యాయత్నం ఎందుకు చేస్తారనే విషయం చర్చనీయాంశమైంది. ఇందులో కీలక పాత్రధారిగా ఉన్న సత్తుపల్లికి చెందిన వ్యక్తి పరారైనట్లు తెలిసింది.