మహిళలపై దేశంలో రోజురోజుకూ అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి. ప్రేమించామంటూ కొందరు, కోరిక తీర్చమంటూ మరికొందరు వెంటపడుతున్నారు. ఒక వేళ ఆ మహిళ వారి ప్రేమను తిరస్కరిస్తే కోపంతో రగిలిపోతున్నారు. అత్యాచారం చేసి, ఏకంగా ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. తాజాగా ఓ యువతిపై దుండగులు అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో స్థానికులు శనివారం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని యువతి శరీరం పడి ఉందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో యువతి మృతదేహం పడి ఉన్న దయాల్నగర్-బేతనపల్లి ప్రాంతానికి పోలీసులు హుటాహుటిన వెళ్లారు. ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టి ఉంటారనే ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఇతర ప్రాంతాలలో ఆమెను హత్య చేసి, స్థానికంగా కాల్చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా జనసంచారం తక్కువగా ఉండడంతో నిందితులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలేవీ తెలియలేదని, ఆమె శరీరం పూర్తిగా కాలిపోయిందని పోలీసులు చెబుతున్నారు. మిస్సింగ్ కేసులను ఆరా తీస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.