దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. పరిచయం లేని మహిళలపైనా కూడా నిందితులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అత్యాచారం చేస్తుంటే ఒప్పుకోలేదని ఓ మహిళపై దుండగుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచి, రైలు నుంచి కిందికి తోసేశాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
యూపీలోని బండా జిల్లాకు 25 ఏళ్ల మహిళకు ఆధ్యాత్మిక భావం ఎక్కువ. ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తర్పూర్ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ ఆలయ సందర్శనకు వెళ్లింది. దైవ దర్శనం తర్వాత ఈ నెల 27న తన సొంత ఊరుకు రైలులో బయల్దేరింది. ఈ క్రమంలో రైలులో ప్రయాణిస్తున్న ఆమెపై తోటి ప్రయాణికుడు కన్నేశాడు. ఆమెను లొంగదీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఆమె నిందితుడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో పట్టరాని ఆగ్రహంతో ఆ మహిళపై నిందితుడు దాడి చేశాడు. వారు ప్రయాణిస్తున్న రైలు మధ్యప్రదేశ్‌లోని ఖజురహో, ఉత్తప్రదేశ్‌లోని మహోబా మధ్య రాజ్‌నగర్ ప్రాంతానికి రాగానే దారుణానికి ఒడిగట్టాడు. కదులుతున్న రైలు నుంచి ఆమెను బయటకు తోసేశాడు. దీంతో బాధిత మహిళ తీవ్ర గాయాలపాలైంది. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చినట్లు జబల్పూర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ ఎస్పీ వినాయక్ వర్మ వెల్లడించారు. నిందితుడి గురించిన వివరాలు తెలిశాయని, కేసు నమోదు చేశామని తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.