లండన్లోని సైడ్‌కప్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ డెబోరా హాడ్జ్ తన పెంపుడు పిల్లిని వివాహమాడింది. ఏప్రిల్ 19న ఇండియా అనే పేరున్న తన పిల్లిని ఆమె పెళ్లి చేసుకుంది. పెంపుడు జంతువులపై ఆమెకు ఉన్న ప్రేమే ఆమెతో ఆ పని చేయించింది. తమ ప్రాంతంలో పిల్లి, కుక్కల వంటి పెంపుడు జంతువులను పెంచుకోవడానికి అనుమతి లేదని ఆమె చెబుతోంది. భవిష్యత్తులో తన నుంచి తన పెంపుడు జంతువులను వేరు చేయకుండా ఉండేందుకు తాను ఈ పని చేశానని పేర్కొంది. ప్రస్తుతం తాను జీవితంలో కోల్పోవడానికి ఏమీ లేదని, పొందడానికి కూడా ఏదీ లేదని చెప్పింది. అందుకే తన పెంపుడు పిల్లి 'ఇండియా'ను వివాహమాడినట్లు వివరించింది. ఇక తమను ఎవరూ విడదీయలేరని ధీమాగా ఉంది.
తన పిల్లలతో సమానంగా పిల్లిని పెంచుకున్నట్లు డెబోరా చెప్పింది. దానిని పెళ్లి చేసుకోవడతో అది తమ కుటుంబంలో భాగం అయిందన్నారు. తన మాజీ భర్త నార్మన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తాడో తనకు తెలియదన్నారు. నార్మన్ అంటే మనిషి కాదు. అది ఆమె పాత ఇల్లు. తాజాగా పిల్లిని వివాహమాడిన డెబోరా 2017లో తన ఇంటిని కూడా వివాహం చేసుకుంది. సంచనాలకు కేంద్రంగా మారిన డెబోరా గతంలో ఉపాధ్యాయురాలిగా పని చేసేది. ఆ ఉద్యోగం మానేసిన తర్వాత టెలివిజన్ షోలలో పని చేసింది.