అమరనాథ్ యాత్రికులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. యాత్రకు వెళ్లే భక్తులు మెడికల్ సర్టిఫికెట్ల జారీ చేసే ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించినట్లు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. దీనిపై ఇప్పటికే ఏపీలోని అన్ని బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఇక అమరనాథ్ యాత్ర జూన్ 30 నుంచి ఆగష్టు 11 వరకు కొనసాగుతుంది. యాత్రికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన మెడికల్ బోర్డు నుంచి ఆరోగ్యానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని యాత్రికులు తమ వెంట తీసుకు రావాలని గతంలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ఇందుకుగానూ అమరనాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తొలుత మెడికల్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు, వయసును నిర్ధారించే అర్హత పత్రం తదితర పత్రాలను తీసుకుని దగ్గరలోని బోధనాసుపత్రికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు చేసుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించే తేదీని వైద్య సిబ్బంది చెబుతారు. ఎంపిక చేసిన తేదీనాడు భక్తులు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. గుండె, ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర విభాగాల వైద్య నిపుణులో కూడిన బృందం వారిని పరీక్షించి ధ్రువపత్రాన్ని జారీ చేసింది.