భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేలా సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని, నడకదారి భక్తులకు దివ్యదర్శనం టికెట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించిందని, త్వరలోనే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఆలయ నిర్మాణానికి ముందుకువచ్చిన గౌతమ్ సింఘానియాకు, స్థలం కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మే 5న సీఎం వైయస్ జగన్ తిరుమలలో పర్యటిస్తారని, చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి శంకుస్థాపన, టాటా క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా జరుగనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.