వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను గడప గడపకూ చేరవేస్తూ పారదర్శకంగా సేవలందిస్తున్న గ్రామ/వార్డు వలంటీర్ల నిబద్ధతను గుర్తిస్తూ వారిని సేవా పురస్కారాలతో సత్కరించే కార్యక్రమం శనివారం వెంకటాచలం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వాలంటీర్లకు ప్రోత్సాహక నగదు బహుమతులతో పాటు శాలువాలు కప్పి సత్కరించి, బ్యాడ్జీలు ప్రశంసాపత్రాలను మంత్రి అందజేశారు. అలాగే వై.యస్.ఆర్ సున్నా వడ్డీ" పథకంపై మహిళలతో భారీ సమావేశం నిర్వహించి చెక్కులను డ్వాక్రా సంఘాలకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సేవచేసేందుకే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారన్నారు. అలాంటి వాలంటీర్లు అంకితభావంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.అదే విదంగా స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు అందించాలని సూచించారు. మరోవైపు వాలంటీర్లకు సత్కారాలు చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నాడని వారి సేవలకు ప్రభుత్వం చేస్తున్న చిరు సత్కారం కోసం పెడుతున్న ఖర్చు వృధా అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను నిస్వార్థంగా ప్రజల ముంగిట అందిస్తున్న వాలంటీర్లు నిస్వార్ధ సేవకులని వారిని ప్రోత్సహించడం కోసం పెట్టె ఖర్చు ను తప్పు బట్టడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. పైగా తన అనుకూల మీడియా, పార్టీల ద్వారా వలంటీర్ వ్యవస్థ పైనే బురద జల్లుతున్నారని విమర్శించారు. వాలంటీర్లు మీరు కూడా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. అనంతరం చల్లా యానాదుల కుటుంబాలకు, చల్లా యానాదుల పిల్లలకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బట్టలు పంపిణీ చేశారు.