కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ జ్యూస్ షాప్ లో షవర్మా తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు.
ఆ షాపు ట్యూషన్ కేంద్రానికి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. చనిపోయిన విద్యార్థినిని కరివళ్లూర్ కు చెందిన దేవానంద (16) గా గుర్తించారు. కన్హాన్ గడ్లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. జ్యూస్ షాప్ పై కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేరిన మరో 18 మంది విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు.