వేటపాలెం మండలం పందిళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరిలో ఒకరు కొత్తపేటలోని ప్రముఖ నాడీ వైద్యుడు శశిధర్ కుమారుడు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో డాక్టర్ శశిధర్ కుమారుడు ధర్మరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వేటపాలెం పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న శశిధర్ కుప్పకూలిపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించాక ధర్మరాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
పుర ప్రముఖులు అనేకమంది డాక్టర్ శశిధర్ ను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ శశిధర్ సనాతన జీవన ట్రస్ట్ ఆశ్రమాన్ని నడుపుతూ ఈ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. రాష్ట్ర మంత్రులు, సినీ నటులు సైతం ఆయన వైద్యం కోసం వచ్చిన సందర్భాలున్నాయి. కరోనా సమయంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటి మంచి వ్యక్తి కుమారుడిని కోల్పోవటం ఎంతైనా శోచనీయమని పలువురు సంతాపం తెలిపారు.