విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన జీవీఎంసీ 53 వ వార్డు పరిధి జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా పార్వతి నగర్ వద్ద నివాసముంటున్న మామిడి లక్ష్మీనారాయణ ( 47 ) అతడి భార్య మామిడి లక్ష్మి ( 40 ) వృత్తిరీత్యా కూలి పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద ఒక ఇంటిలో నిర్మాణ పనుల్లో బాగంగా ఆదివారం విధులకు వెళ్లారు. ఇదిలా ఉండగా సాయంత్రం సమీప ఇంటి స్లాబ్ రాడ్ లను తొలగించే క్రమంలో సమీప విద్యుత్ సర్వీస్ వైర్ కు ఆనుకొని ఉన్న పైపును పట్టుకున్నాడు. ఈ క్రమంలో టైపు విద్యుత్ సరఫరా ఉండడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలో చేరుకున్న అతడిని ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే నారాయణ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. తన కళ్లెదుటే భర్త మృతి చెందడంతో భార్య లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా మృతునికి కుమారుడు మామిడి తిరుపతిరావు ( 24 ), కుమార్తె మామిడి దివ్య ( 21 ) ఉన్నారు.