ఉక్కు కర్మాగార పరిరక్షణ కార్మికుల ఆకాంక్షని 78వవార్డు కార్పొరేటర్ బి. గంగారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 444వ రోజు కొనసాగాయి. ఆదివారం ఈ దీక్షలలో పాల్గొన్న సీఎంఎం, సీఎంఈ, టెలికాం విభాగ కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. శాంతియుతంగా కార్మికులు చేస్తున్న పోరాటాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, అయోధ్యరామ్‌లు దీక్షా శిభిరం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ జెండాలను ఆవిష్కరించారు. కార్మికులందరికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజా నాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, కేఎస్‌ఎన్ రావు, గంధం వెంకటరావు, దొమ్మేటి అప్పారావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్, పరంధామయ్య, సన్యాసిరావు, సంపూర్ణం, వైటి దాస్, జె. రామకృష్ణ, మసేన్‌రావు పాల్గొన్నారు.