ఏపీలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మృతదేహం తరలింపునకు 108 నిరాకరించడంతో ఓ తండ్రి తన కూతురి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లాడు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం దొరవారిసత్రం మండలం కొత్తపల్లిలో అన్నాచెల్లెలు శ్రవంత్, అక్షయ గ్రావెల్ గుంతలో పడి నీట మునిగారు.
శ్రవంత్ ను గొర్రెల కాపరి కాపాడగా అక్షయ పరిస్థితి విషమించింది. నాయుడుపేట ఆస్పత్రికి తరలించేలోగా ఆ చిన్నారి మృతి చెందింది. ఆస్పత్రి నుంచి చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించారు. ఆటో డ్రైవర్లు సైతం నిరాకరించారు. ప్రైవేటు అంబులెన్స్ కు డబ్బుల్లేకపోవడంతో బాలిక తండ్రి బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.