ప్రముఖ హిందూ జ్యోతిర్లింగ దేవాలయం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను తెరిచారు అధికారులు.
వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివ నామ స్మరణతో కేదార్నాథ్ గిరిలు మార్మ్రోగిపోయాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పూజా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. కేదార్నాథ్ ఆలయం పునఃప్రారంభం సందర్భంగా యాత్రకు వచ్చే భక్తులకు సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు. మరోవైపు మే 3 నుంచి చార్ ధామ్ యాత్ర కూడా ప్రారంభమైన నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.వేలాదిగా భక్తులు కేదార్నాథ్ చేరుకోవడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం అన్ని ఆలయాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తుల రద్దీ, కరోనా ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని రోజుకి 12000 మందిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు అధికారులు. బద్రీనాథ్ ఆలయానికి మాత్రం 15000 మంది భక్తులను అనుమతించనున్నారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు కరోనా పరీక్ష అవసరంలేదని, వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా అవసరం లేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.