కొందరికి కొన్ని వంటకాలు అంటే వల్లమాలిన అభిమానం. కొంత మందికి గోంగూర, మరికొంత మందికి సాంబారు, ఇంకొంత మందికి బిర్యానీ అంటే చెవి కోసుకుంటారు. ఇక ఘుమఘుమలాడే బిర్యానీ అంటే ప్రముఖులు సైతం లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇదే కోవలో ఓ వ్యక్తి విందులో బిర్యానీ కనపడగానే తృప్తిగా ఆరగించాడు. అయితే దానితో పాటు బంగారం కూడా మింగేశాడు. ఇలా వెరైటీగా దొంగతనం చేసి చివరికి కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చెన్నైలో మే 4న రంజాన్ పర్వదినం సందర్భంగా జ్యువెలరీ షాపులో పని చేసే ఓ మహిళ తన స్నేహితులకు విందు ఏర్పాటు చేసింది. ఆ విందుకు ఆమె స్నేహితురాలు తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వచ్చింది. అతడు అందరితో పాటే చక్కగా బిర్యానీ, ఇతర వంటకాలు ఫుల్లుగా లాగించేశాడు. దాంతో పాటు తన హస్తలాఘవాన్ని కూడా ప్రదర్శించాడు. ఆతిథ్యం ఇచ్చిన ఆమె ఇంట్లో గోల్డ్ చైన్, నెక్లెస్‌ను జేబులో వేసుకుంటే దొరికి పోతాననే భయంతో కొత్త ప్లాన్ వేశాడు. దానిని భోజనంతో పాటే గుట్టుచప్పుడు కాకుండా మింగాడు. బంగారం కనిపించకపోవడంతో అతిథులుగా వచ్చిన వారిలో ఎవరో ఒకరు ఆ పని చేసి ఉంటారని, ఆతిథ్యం ఇచ్చిన మహిళకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతిథులందరికీ స్కానింగ్ చేయించారు. దీంతో నిందితుడు పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.