తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎం స్థానంలో ఉండి కూడా ఆయన సామాన్యుడిలా ఉండడంపై పలువురు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తమిళనాట డీఎంకే ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తైంది. దీంతో చెన్నై మెరీనా బీచ్‌లో ఉన్న కరుణానిధి స్మారకం, అన్నా మెమోరియల్‌కు వెళ్లేందుకు ఆయన శనివారం ఆర్టీసీ బస్సు ఎక్కారు. ప్రభుత్వ బస్సుల పనితీరు ఎలా ఉందోనని పరిశీలించారు. బస్సులోని సాధారణ ప్రయాణికులు, కండక్టర్‌తో మాట్లాడారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇక సీఎం తాము ప్రయాణిస్తున్న బస్సు ఎక్కడంతా వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో రాజకీయ నేతలు స్టాలిన్‌ను ఆదర్శంగా తీసుకోవాలనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.