సరిగ్గా రెండేళ్ల క్రితం. ఇదే రోజున విశాఖ షాక్‌కు గురైంది. సూర్యోదయం కాకముందే ఆర్తనాదాలు మిన్నంటాయి. ఏం జరుగుతోందో తెలియదు. ఏం జరిగిందో అంతు పట్టలేదు. కళ్లల్లో మంటలు. శరీరమంతా దద్దుర్లు. ఊపిరిరాడక పశుపక్ష్యాదులు ఉన్నచోటే కుప్పకూలిపోయాయి. చాలా మంది ప్రజలు ఊపిరితీసుకోలేక అక్కడికక్కడే పడిపోయారు. వీరిలో 15 మంది మృతి చెందగా. వందలాది మంది వెంకటాపురం పరిసర ప్రాంతాల ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషవాయువులకు జనం ఒక్కసారిగా భీతిల్లిపోయారు. 2020 మే 7వ తేదీ ఈ విషాధ సంఘటన జరిగిన రోజు.
విశాఖ జిల్లా గోపాలపట్నం వద్దగల వెంకటాపురంలో ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి 2020 మే 7 తెల్లవారుజామున 3 గంటలకు లీకైన విషవాయువు (స్టెరైన్ గ్యాస్) ఘటనతో అక్కడి ప్రజలు నేటికీ తేరుకోలేకపోతున్నారు. గ్రామస్తుల్లో అత్యధిక మంది కళ్ల మంటలు, స్కిన్ అలర్జీలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ తీవ్ర అవస్థలకు గురౌతున్నారు. భోపాల్ తరహా దుర్ఘటన దుష్ఫలితాలే దీర్ఘకాలంలో ఇక్కడి ప్రజలను పీడిస్తాయని అధ్యయన నివేదికలు స్పష్టం చేశాయి. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాన్ని ఆదుకునే వైద్య ప్రణాళికలను నేటికీ సిద్ధం చేయలేదు.
దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జి పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పరిశ్రమలో స్టోరేజీ ట్యాంకుల నుంచి వెలువడిన విషవాయువు ఆనాడు జనం ఊపిరి తీసేసింది. అనారోగ్యం పాలైన వందల మంది జనం నేటికీ వైద్యం సక్రమంగా అందక కొట్టుమిట్టాడుతున్నారు. ఊరు ఊరంతా గాఢనిద్రలో ఉన్న వేళ ఆ రాత్రి తీవ్ర విషాద రాత్రినే విశాఖ వాకిట మిగిల్చిందని చెప్పొచ్చు. ఘటన జరిగిన రోజే 12 మంది మృతి చెందగా మూడు రోజుల వ్యవధిలో మరో ముగ్గురు చనిపోయారు. పరిహారం మాత్రం తొలుత మృతి చెందిన 12 మందికే ప్రభుత్వం కుటుంబానికి రూ. కోటి చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగతా ముగ్గురి కుటుంబాలు వారు ఫోరెన్సిక్ నివేదికలో దొర్లిన పొరపాట్ల కారణంగా పరిహారానికి నోచుకోలేదు. ఎల్‌జి యాజమాన్యంలో రిస్క్ అసెస్‌మెంట్ మేనేజిమెంట్ అత్యంత బలహీనంగా ఉంది. పరిశ్రమలో పని చేసిన 360 మంది కాంట్రాక్టు కార్మికులకు నేడు ఎలాంటి ఉపాధీ లేదు, వీరికి నష్టపరిహారాన్ని సైతం అటు ప్రభుత్వం, ఇటు ఎల్‌జి యాజమాన్యం ఇంత వరకూ ఇవ్వలేదు.
ప్రస్తుతం వెంకటాపురం గ్రామంలో శ్వాసకోశ సమస్యలతో పలువురు అవస్థలు పడుతున్నారు. అప్పట్లో 800 మంది ఆసుపత్రి పాలయ్యారు. యువకులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఆయాసంతో బాధపడుతున్నారు. శరీరంపై విపరీతంగా తొక్కలు ఊడిపోవడం, ఆయింట్ మెంట్ తీసుకొచ్చి రాస్తే కొంత తగ్గడం, మరలా దద్దుర్లు మాదిరిగా రావడం. ఇప్పటికీ కనిపిస్తున్న అనారోగ్య లక్షణాలు. ఐదేళ్లపాటు గ్రామంలో వైద్య పరీక్షలు నిరంతరాయంగా నిర్వహించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి), ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల కమిటీ, ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 12 బెడ్స్‌తో వెంకటాపురంలో ఆసుపత్రి నిర్మాణం చేస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించి మడమ తిప్పేశారు.
ప్రభుత్వం పట్టించుకోని వెంకటాపురం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన గత నెల 24న నిర్వహించిన వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు వైద్య పరీక్షల కోసం తరలివచ్చారు. 260 మంది బాధితులు వైద్యుల వద్దకు వచ్చి తమ సమస్యలను తెలిపారు. ముఖ్యంగా ఎముకలు, ముడుకుల నొప్పులతో బాధపడుతున్న యువత, శరీరమంతా అలర్జీ ఉన్నవారు, కళ్ల మంటలు, శ్వాస తీసుకునేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్న వారు వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారందరికీ పరీక్షలు నిర్వహించి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం వారు మందులు అందజేశారు.