కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలు ఇటీవల చెలరేగాయి. ఈ క్రమంలో వాటికి బీజేపీ అగ్రనేతలు తెరదించారు. అయినప్పటికీ సీఎం మార్పు అంశం ఆ రాష్ట్రంలో కీలక చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు సీఎం పోస్టు ఇచ్చేందుకు కొందరు ఆఫర్ చేశారని, అందుకు రూ.2,500ల కోట్లు అడిగారని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారని ఆయన ప్రకటించారు. అయితే ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. ఈ కామెంట్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపాయి.
కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, విచారణకు కేంద్రం ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై వివిధ రాజకీయ పక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. బీజేపీలో పదవుల కోసం డబ్బులు చెల్లించే సంస్కృతి ఉందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్‌లో బీజేపీపై విమర్శలు చేశారు. దీనిపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఏం చెబుతారని ప్రశ్నించారు.