మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శనివారం ఘోర ప్రమాదం జరిగింది. రెండంతస్తుల భవనంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు చనిపోయారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకున్నారు. ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.
ఇండోర్‌లోని స్వర్న్ బాగ్ కాలనీలో ఉన్న భవనం బేస్‌మెంట్‌లో తెల్లవారుజామున 3.10 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ నివసిస్తున్న వారంతా నిద్రిస్తున్న కారణంగా తప్పించుకోలేకపోయినట్లు వివరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని వారు చెప్పారు. మంటలు అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలకు వ్యాపించాయని చెప్పారు. దీంతో భవనం మొత్తం కొద్ది సమయంలో దట్టమైన మంటల్లో దగ్ధమైందని చెప్పారు.