ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ మెండుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్ట కాలంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఇంతకుముందు కంటే తాము మరింత బలవంతులమయ్యామని, ప్రజాబలం మరింత పెరిగిందని అన్నారు. మరో ఏడాదికో లేకుంటే రెండేళ్లకో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఎన్నికలకు రెండేళ్లున్నా ఇప్పటికే ఆ వాతావరణం ఏపీలో ప్రతిబింబిస్తోంది. ఈ తరుణంలో సజ్జల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
మరోవైపు ప్రతిపక్షాలపై సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని మీడియా ప్రస్తావించగా, వారు గతంలోనూ కలిసే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అధికారం రాదని తెలిసి, విడిపోయినట్లు నటించారని, త్వరలో కలిసే పోటీ చేస్తాయని అన్నారు. పార్టీలన్నీ ఉమ్మడిగా పోటీ చేసినా, వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమన్నారు. తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని స్పష్టం చేశారు.