వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాక, పెళ్లి పేరు ఎత్తగానే అతడు తప్పించుకుంటున్నాడు. గట్టిగా నిలదీస్తే గతంలో సేకరించిన న్యూడ్ ఫొటోలను అడ్డం పెట్టుకుని బెదిరించసాగాడు. కుమార్తె ఫొటోలను ఏకంగా ఆమె తండ్రి ఫోన్‌కు నిందితుడు పంపించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఎస్.కోట మండలంలో ఓ యువతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్‌గా పని చేస్తోంది. ఆమెకు గ్రామ సచివాలయంలోనే ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రెడ్డి నవీన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి, సన్నిహితంగా మెలిగాడు. ఈ క్రమంలో ఆమె నుంచి న్యూడ్ ఫొటోలను కూడా సేకరించి, తన వద్ద పెట్టుకున్నాడు. ఇవేమీ తెలియని ఆ యువతి అతడి మాయలో పడిపోయింది. అతడిని ఇటీవల పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి నిరాకరించిన అతడు తన వద్దనున్న యువతి ఫొటోలను ఆమె తండ్రి ఫోన్‌కు పంపించాడు. ఇవి చూసిన బాధిత యువతి తండ్రి కుప్పకూలిపోయాడు. సన్నిహితుల సూచనతో యువతి తల్లిదండ్రులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.