ఫేస్ బుక్ మిత్రుడి సాయంతో ఓ మహిళ తన ప్రియుడిని హత్య చేయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ఇద్దరిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాగ్ అంబర్‌పేటకు చెందిన యశ్మకుమార్(32) కు మీర్‌పేట ప్రశాంతిహిల్స్‌కు చెందిన శ్వేతారెడ్డి(32) 2018లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఇద్దరి మధ్య చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. అతను ఆమెకు ఫోన్ చేసి నగ్నంగా తనకు వీడియో కాల్ చేయాలని కోరాడు. ఆమె అదే విధంగా చేసింది. నెల రోజుల నుంచి యశ్మ కుమార్ శ్వేతారెడ్డికి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. లేదంటే ఆ వీడియో, ఫొటోలను అందరికీ షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయపడి అతన్ని చంపాలనుకుంది.
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఏపీలోని కృష్ణా జిల్లా తిరువురు మండలానికి చెందిన కొంగల అశోక్(28)కు ఫోన్ చేసి యశ్మ కుమార్ ను హత్య చేయాలని చెప్పింది. అశోక్ ఈ నెల 4న హైదరాబాద్ కు వచ్చాడు. అదే రోజు రాత్రి యశ్మకుమార్ కు ఆమె ఫోన్ చేసి ప్రశాంతిహిల్స్ కు రప్పించింది. అర్ధరాత్రి సమయంలో అశోక్ మరో వ్యక్తి కార్తిక్ తో కలిసి యశ్మ కుమార్ ఉన్న చోటుకు చేరుకున్నాడు. వెనుక నుంచి తలపై సుత్తితో కొట్టి పరారయ్యారు. ఆసుపత్రిలో చేర్పించగా 6వ తేదీన యశ్మ కుమార్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ పుటేజీల సహాయంతో శ్వేతారెడ్డితో పాటు హత్యకు పాల్పడిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు.