కాశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. గురువారం సాయంత్రం కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని చదూరాలోని తహసీల్ కార్యాలయ ఉద్యోగి కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను కార్యాలయంలోనే కాల్చి చంపారు. ఇది మరువక ముందే శుక్రవారం తెల్లవారుజామున పుల్వామాలోని గుడ్రూలోని జమ్మూ కాశ్మీర్ పోలీసు కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్ థోకర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. 24 గంటల వ్యవధిలో కాశ్మీర్ లోయలో ఇది రెండు హత్యలకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఇక కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్ విషయంలో స్థానికులు భగ్గుమన్నారు. నిరసనకారులు శ్రీనగర్-బుద్గాం రహదారిని కాశ్మీర్ పండిట్లు దిగ్బంధించారు.
ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం పుల్వామాలోని భట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ప్రయత్నించారు. కాశ్మీరీ పండిట్లను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనందుకు తాను నిరసన తెలిపేందుకే అక్కడకు వెళ్తున్నట్లు ముఫ్తీ తెలిపారు. అయితే ఆమెకు స్థానిక పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక భట్ హత్యపై ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. లాఠీ ఛార్జ్ చేయడంతో పాటు బాష్ప వాయువును ప్రయోగించారు. దీనిపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. పోలీసుల వైఖరి 'సిగ్గుచేటు' అని అభివర్ణించారు.