అమెరికాలో జాత్యహంకారం మరోసారి వెలుగు చూసింది. ఓ శ్వేత జాతీయుడి చేతిలో తుపాకీ తూటాలకు 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. న్యూయార్క్ నగరంలోని బఫెలో ప్రాంతంలో నల్లజాతీయులు ఎక్కువగా ఉండే విభాగంలోని సూపర్ మార్కెట్ వద్ద శనివారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. భారీగా ఆయుధాలు ధరించిన 18 ఏళ్ల తెల్లజాతి యువకుడు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. జాత్యహంకార దాడిలో ఇది అమెరికా చరిత్రలో చీకటి రోజుగా అక్కడి ప్రజలు అభివర్ణిస్తున్నారు. నిందితుడిని న్యూయార్క్‌లోని కాంక్లిన్‌కు చెందిన పేటన్ ఎస్. జెండ్రాన్(18)గా కోర్టులో గుర్తించారు.
శనివారం సాయంత్రం కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టారు. అయితే నిందితుడు నేరాన్ని అంగీకరించలేదు. దీంతో పెరోల్ లేని జీవిత ఖైదును నిందితుడికి కోర్టు విధించనుంది. దుండగుడు మొదట పార్కింగ్ స్థలంలో కాల్పులు జరిపాడని, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని పోలీసు అధికారి గ్రామగ్లియా చెప్పారు. ఆ తర్వాత సూపర్ మార్కెట్‌లోకి నిందితుడు వెళ్లాడని, అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డును, లోపల సిబ్బందిపై తూటాల వర్షం కురిపించాడన్నారు. 13 మంది బాధితుల్లో 11 మంది నల్లజాతీయులని మీడియాకు పోలీసులు వెల్లడించారు.