సులభంగా వచ్చే డబ్బు అంటే చాలా మందికి మోజు ఉంటుంది. ఈ క్రమంలో కాసుల కోసం కొందరు విలువలు వదిలేస్తున్నారు. డబ్బున్న వారిని హనీ ట్రాప్ చేసి, ఆ తర్వాత వీడియోలు చూపించి బెదిరిస్తున్నారు. వారి నుంచి అందినకాడికి దండుకున్నారు. ఇదే కోవలో 40 ఏళ్లు దాటిన వ్యక్తిని ఓ మహిళ ట్రాప్ చేసింది. ఆ తర్వాత అతడితో సంబంధం పెట్టుకుని దానిని వీడియో తీసింది. ఆ వీడియోను చూపించి, అతడిని బెదిరించి డబ్బులు గుంజేది. చివరికి అతడి ఆత్మహత్యకు ఆ మహిళ కారణమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బెంగళూరు హేరోహళ్లి వార్డుకు చెందిన బీజేపీ నేత అనంతరాజు (46) అందరితోనూ బాగానే ఉండేవాడు. అనారోగ్య సమస్యలు కూడా లేవు. అయితే హఠాత్తుగా మే 12న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కూడా కుటుంబ సభ్యులకు తెలియదు. వ్యక్తిగత సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంతా భావించారు. అయితే ఇటీవల అతడు రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అది చదవగానే పోలీసులకు విషయం అర్ధం అయింది. కేఆర్ పురకు చెందిన రేఖా ఫేస్‌బుక్‌లో అనంతరాజుకు పరిచయమైందని, ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని పోలీసులకు సూసైడ్ లేఖ ద్వారా తెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ మహిళ వీడియో తీసి, వాటిని చూపి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడేదని లేఖలో అనంతరాజు ఆవేదన తెలిపాడు. ఆమె వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు రాశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. రేఖ కోసం గాలింపు చేపట్టారు.