ఏపీలోని భారీ పవర్ ప్రాజెక్టుకు సీఎం జగన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మిటం తండాలో ప్రపంచంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టు పనులను ఆయన ప్రారంభించారు. 5,410 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ కోఎనర్జీస్ లిమిటెడ్ నిర్మించనున్న పవర్ ప్రాజెక్ట్ నుండి సౌర, పవన, జలశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. రూ.15 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఒకే ప్లాంట్ నుంచి మూడు రకాల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలోనే తొలిసారి కానుంది. జలవిద్యుత్ ఉత్పత్తికి నీటిని రీసైకిల్ చేస్తారు.
ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని, తక్కువ ఖర్చుతో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఇది ప్రతిరోజూ 50 జీడబ్ల్యుహెచ్ విద్యుత్‌ను డీకార్బోనైజేషన్ చేయడంలో సహాయపడుతుందన్నారు. సంవత్సరానికి 15 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను భర్తీ చేస్తుందని తెలిపారు. ఇది 50 లక్షల పెట్రోల్ లేదా డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడం, లేదా 2.5 మిలియన్ హెక్టార్ల అటవీ పెంపకంతో సమానమని తెలిపారు.
ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. తొలుత స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ పైలాన్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించింది. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3000 మెగావాట్లు, విండ్ 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1860 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.