పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలోపోర్ట్ సిటీలో రద్దీగా ఉండే బోల్టన్ మార్కెట్ ఏరియాలో బాంబు పేలుడు ఘటన జరిగింది. పాకిస్థాన్ ఆర్థిక రాజధానిగా పేరొందిన కరాచీ నగరంలో నెల రోజుల వ్యవధిలో సంభవించిన మూడో పేలుడు ఇది కావడం గమనార్హం. ఈ నెల 12న సద్దార్ ఏరియాలో బాంబు పేలుడు జరగడంతో ఒకరు చనిపోగా.. 13 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ వాహనాన్ని టార్గెట్‌గా చేసుకొని ఈ పేలుడు జరిపి ఉంటారని పోలీసులు వెల్లడించారు. కానీ వాహనంలో ఉన్న సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.
కరాచీ యూనివర్సిటీ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీస్ టీచర్లు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయిన వారాల వ్యవధిలోనే ఈ బాంబు పేలుడు సంభవించడం గమనార్హం.
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన పోర్ట్ సిటీలో రద్దీగా ఉండే బోల్టన్ మార్కెట్ ఏరియాలో సంభవించిన ఈ పేలుడులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. పేలుడుకు సంబంధించి సమాచారం అందగానే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. పేలుడు జరిగిన బోల్టన్ మార్కెట్ ప్రాంతంలో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే బిజినెస్ హబ్‌లలో ఇదొకటి.
ఇదిలా ఉంటే రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ఉగ్రదాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయగా ఆయన స్థానంలో షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ 2018 నుంచి గ్రే లిస్టులో ఉంచుతోంది. బలూచిస్థాన్ ఉద్యమకారులతోపాటు, ఇతర ఉగ్రవాదుల దాడులతో పాక్ రక్తమోడుతోంది. పాకిస్థాన్ ప్రస్తుతం ఐదో తరం యుద్ధాన్ని ఎదుర్కొంటోందంటూ పాక్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ముహమద్ అరూన్ అస్లాం ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌ను నాశనం చేయడానికి అంతర్గత, బాహ్య శక్తులు ఎంతగా ప్రయత్నిస్తున్నాయో కొత్త రూపంలో ఉన్న ఉగ్రవాదాన్ని చూస్తే అర్థం అవుతోందంటూ పాక్ జర్నలిస్టు ఒకరు ట్వీట్ చేశారు.