తాళి కట్టే సమయానికి కొద్ది క్షణాల ముందు వధువు తనకు ఇదివరకే పెళ్లి అయ్యిందని చెప్పి షాకిచ్చింది. మరో పెళ్లి చేసుకోలేనని తేల్చిచెప్పింది. దీంతో వరుడు పెళ్లి పీటలమీదే మూర్చపోయాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలోని రేణు గ్రామంలో జరిగింది. ఉలుదా గ్రామానికి చెందిన యువకుడితో రేణు గ్రామానికి చెందిన యువతి వివాహం నిశ్చయించారు. తాళి కట్టే సమయంలో వధువు మండపం నుంచి లేచి చేతులకు వేసుకున్న గాజులను తొలగించింది. తనకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లి జరిగిందని, మరోసారి చేసుకోలేనని చెప్పింది. ఈ షాక్ తో వరుడు కళ్లు తిరిగి పడిపోయాడు. చివరి క్షణంలో ఇలా చేయడంతో వధువు కుటుంబ సభ్యులు కోపంతో వధువును చితకబాదారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.