పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ రేసులో డజనుకు పైగా వ్యక్తులు ఉన్నారు. ఎవరికి వారే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జగదీశ్వరి తో పాటు, ఒక రెవెన్యూ అధికారి, అలాగే కొమరాడ మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిడ్డిక తమ్మయ్య మాజీ ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్ భార్య, మరో మాజీ ఎమ్మెల్యే శతృచర్ల ఎమ్మెల్యే చంద్ర శేఖర్ రాజు కుమార్తె పల్లవి, మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ దేవ్ తనయుడు విరేష్, ఇంకోవైపు ఒక బ్యాంకు అధికారి అలాగే ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు మరో రిటైడ్ ఉపాధ్యాయుడు, అలాగే ఒక వైద్యుని భార్య మరో మాజీ ఎంపీటీసీ మహిళా అభ్యర్థి ఇలా డజనుకు పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఈ నియోజకవర్గంలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అనే అంచనాలతోనే ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పోటీ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జిల్లా లో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో లేని పోటీ ఇక్కడ ఏంటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తు ఎన్నికల వస్తాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో అందరూ చురుగ్గా పాల్గొంటున్నారు.
అయితే ఈ సారి శ్రేష్టమైన గిరిజన అభ్యర్థి కి మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని, అదికూడా మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.