జీఎస్టీ మండలి సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అసవరం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. వస్తు, సేవల పన్ను మండలి చేసిన సిఫార్సులపై సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పునిచ్చింది. జీఎస్‌టీపై చట్టాన్ని రూపొందించడానికి పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు సమానమైన అధికారాలను కలిగి ఉంటాయని కోర్టు తెలిపింది. అవసరమైతే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేరుగా ప్రత్యేక చట్టాలు కూడా చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 246A, 279 కింద ఉన్న నిబంధనల ప్రకారం పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉన్నాయని, ఒకదానికొకటి స్వతంత్రంగా వ్యవహరించ లేవని కోర్టు పేర్కొంది. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని కూడా కోరింది. ఏకాభిప్రాయం రావడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సి అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
2007 ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (IGST) చట్టం ప్రకారం సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించిన గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌పై కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఓడలో వస్తువుల రవాణా సేవలపై ఐదు శాతం ఐజీఎస్టీ విధించాలని 2017 ప్రభుత్వ నోటిపికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన అదే తీర్పును గురువారం సుప్రీంకోర్టు సమర్థించింది. కాగా జీఎస్టీ, ఐజీఎస్టీ రూపాల్లో ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ప్రభుత్వాలపై ఉన్నాయి.