ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో భారీ సింక్‌ హోల్‌... కనుగొన్న పరిశోధకులు

international |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 08:32 PM

భారీ సింక్‌ హోల్‌.. అందులో అద్భుతమైన పురాతన అటవీ ప్రాంతం. ఇదేదో సినిమా గ్రాఫిక్స్ సీన్ కాదు. చైనా లో బయటపడిన ఓ అద్భుత దృశ్యం. చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతంలో ఒక భారీ సింక్‌ హోల్‌ను చైనా పరిశోధకులు కనుగొన్నారు. దానిలో అద్భుతమైన పురాతన అటవీ ప్రాంతం ఉన్నట్టు గుర్తించారు. చైనా అధికారిక మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. దీనిలో చెట్లు 131 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇంతకు ముందు చూడని మరిన్ని జీవులు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఈ సింక్ హోల్ 630 అడుగుల లోతు..1,004 అడుగుల ఎత్తు..492 అడుగుల వెడల్పున్నట్టు తెలిపింది. ఇందులో అందమైన అడవి కూడా ఉందని జిన్హువా పేర్కొంది. తాజా దానితో కలిసి చైనాలో సింక్ హోల్స్ సంఖ్య 30కి చేరింది.


ప్రస్తుతం ఈ సింక్ హోల్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుత ప్రాంతం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అప్పుడప్పుడు భూగర్భంలో జరిగే మార్పుల కారణంగా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఈ సింక్ హోల్ కూడా అలాగే ఏర్పడింది. భూమి కుంగిపోవడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ.. ఈ స్థాయిలో సింక్ హోల్స్ ఏర్పడటం.. చాలా అరుదు. అంతేకాదు, దానిలో ఓ అందమైన అడవి పెరగడం నిజంగా అద్భుతమనే చెప్పాలి


గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌ లేయే కౌంటీలోని పింగ్ గ్రామ సమీపంలో సింక్ హోల్‌ను గుర్తించారు. ఇందులో పురాతన చెట్లను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చెట్ల కొమ్మలు చాలా అందంగా.. ఎత్తులో కనువిందు చేస్తున్నాయని తెలిపారు. ఈ సింక్ హోల్ 1,004 అడుగులకు పైగా పొడవు, 492 అడుగుల వెడల్పుతో ఉందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్ట్ జియాలజీ సీనియర్ ఇంజనీర్లు వివరించారు. ఈ సింక్ ‌హోల్‌లో దట్టమైన పొదలు కూడా ఏర్పడ్డాయని, ఒక వ్యక్తి భుజానికి సరిపోయేంత ఎత్తులో ఉన్నాయని తెలియజేశారు. అంతేకాదు ఈ గుహల్లో ఇప్పటి వరకు సైన్స్‌కి లభించని జాతులు కూడా ఉన్నాయనే అంచనా వేస్తున్నారు.


పరిశోధకులు సింక్‌హోల్ దిగువకు చేరుకోవడానికి చాలా గంటలు కాలినడక ప్రయాణించాల్సి వచ్చింది అని జిన్హు తెలిపింది. అక్కడకు చేరుకున్న తర్వాత లోపలికి వెళ్లడానికి మూడు ప్రవేశ మార్గాలను గుర్తించారని పేర్కొంది. సింక్‌హోల్ దిగువన పురాతన కాలం నాటి అడవి ఉంది. గ్వాంగ్జీ 702 అన్వేషణ బృందానికి నాయకత్వం వహించిన చెన్ లిక్సిన్ మాట్లాడుతూ.. దిగువన ఉన్న పురాతన చెట్లు దాదాపు 40 మీటర్ల ఎత్తు (131 అడుగులు), దట్టంగా అళ్లుకుని ఉన్నారు. ఇప్పటి వరకు సైన్స్ గుర్తించని లేదా వర్ణించని జాతులు ఇందులో కనిపిస్తే తాను ఆశ్చర్యపోనని లిక్సిన్ చెప్పారు.


అమెరికా నేషనల్ కేవ్ అండ్ కార్ట్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జార్జ్ వేణి మాట్లాడుతూ.. ఇది చాలా మంచి వార్త అని అన్నారు. ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాలలో సింక్‌హోల్స్ చాలా తక్కువగా ఉండవచ్చు, కేవలం ఒక మీటరు లేదా రెండు మాత్రమే వ్యాసం కలిగి ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల మందికి కార్ట్స్ జలాశయాలు ప్రాథమిక నీటి వనరులను అందిస్తున్నాయని, కానీ అవి సులభంగా కలుషితమవుతాయని వేణి అన్నారు.


గ్వాంగ్జీ ప్రాంతం అందమైన కార్ట్స్ ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా శిలల కరగడం ద్వారా ఇవి ఏర్పడతాయి. దక్షిణ చైనాలో కార్ట్స్ నిర్మాణాలు కారణంగా ఆ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com