నక్కపల్లి మండలంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన నీటిని ఏలేరు కాలువ నుంచి సరఫరా చేసేందుకు గురువారం అధికారుల బృందం కోటవురట్ల మండలంలో పర్యటించింది. ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యం విజయవాడ నుంచి వచ్చినఅధికారులు యండపల్లి వద్ద ఏలేరు కాలువను పరిశీలించారు. ఇక్కడి నుంచి పైపులైన్ల ద్వారా స్టీల్‌ప్లాంట్‌కు నీటిని తరలించే అంశంపై చర్చించారు. ఇక్కడి నుంచి నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద స్టోరేజీ ట్యాంకు వద్దకు దూరం ఎంత? పైపులైన్ల ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? అన్నది అంచనా వేస్తామన్నారు. ఒకవేళ ఏలేరు కాలువ నుంచి సాధ్యం కాకపోతే దార్లపూడి వద్ద పొలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని తరలించవచ్చన్న ఉద్దేశంతో అధికారులు పోలవరం కాలువను కూడా సందర్శించారు.