విజయవాడ లోని ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు శాఖ నిర్వహించిన నాగభైరవ కోటేశ్వరరావు విరచిత కవనవిజయం సాహిత్య రూపకం ఆద్యంతం హృద్యంగా సాగింది. 515వ ప్రదర్శనగా గురువారం సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ రూపకం సాగింది. తొలుత సింహాద్రి జ్యోతిర్మయి కవులను సభకు పరిచయం చేయగా డాక్టర్ నాగభైరవ ఆది నారాయణ ప్రయోక్తగా వ్యవహరించారు. సిహెచ్.ఏడుకొండలు (ప్రబంధకవి),నట్టే ప్రసాద్ (భావకవి), కప్పగంతు జయరామయ్య (అభ్యుద కవి), ఈదుమూడి ఆంజనేయులు (విప్లవకవి), డాక్టర్ నూనె అంకమ్మ రావు (దిగంబరకవి), డాక్టర్ బీరం సుందరరావు (దళితకవి), తేళ్ల అరుణ(సినీకవి), నూకతోటి శరత్‌బాబు (ప్రజా కవి),ఈదుమూడి జయంతి (నవలా రచయిత్రి), బత్తుల బ్రహ్మారెడ్డి (క్లార్క్ సూర్యారావు) కవితా గానం చేసి అలరింపచేశారు.
సమకాలీన సమాజంపై ప్రముఖ కవుల అక్షర శతఘ్నులతో సభ మార్మోగింది.కళాపీఠం పాలకవర్గసభ్యులు తాతినేని శ్రీహరిరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, కళాశాల డీన్ ఆచార్య రాజేష్ సి.జంపాల, కవుల పాత్రలను పోషించిన వారిని, సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లును ఘనంగా సత్కరించారు. తెలుగు శాఖాధిపతి డాక్టర్ నందనవనం శివకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సశ్రీ, జి.శేషారత్నం ఈ కార్యక్రమం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పందిస్తూ ఈ సాహిత్య కార్యక్రమం ద్వారా ప్రముఖ కవుల పదునైన భావాలను, వారి సాహిత్య ప్రయోగాలను తెలుసుకోగలిగామన్నారు.