ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. కుమార్ అనే డ్రైవర్ పని నిమిత్తం తన లారీతో గన్నవరానికి చేరుకున్నాడు. లారీ నడుపుతుండగా కుమార్ ఒక్కసారిగా గుండె పోటుకు గురయ్యాడు. నొప్పి తీవ్రంగా రావడంతో వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు ఆపేశాడు. నొప్పి విపరీతంగా రావడంతో క్యాబిన్లో విలవిల్లాడుతూ పడిపోయాడు. సీటులోనే కుప్పకూలి తీవ్ర వేదనకు గురయ్యాడు. పక్కన వెళ్తున్న వాహనదారులు సైతం అతన్ని గమనించలేదు.
దీంతో ఏం చేయలేక క్యాబిన్‌లోనే ఉండిపోయాడు.లారీ చాలా సేపటి నుంచి అక్కడే ఆగి ఉండడాన్ని గమనించిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెంటనే వాహనం వద్దకు చేరుకున్నాడు. డ్రైవర్ కుమార్ కుప్పకూలిపోయి నొప్పితో విలవిల్లాడటాన్ని ఆయన గమినించారు. దీంతో వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి వాహనాన్ని రప్పించారు. అనంతరం అతన్ని విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే కుమార్‌ను పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. స్పృహలోకి వచ్చిన కుమార్ తనను కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.