యమునోత్రి నేషనల్ హైవేపై శనివారం ఘోర ప్రమాదం తప్పింది. రక్షణ గోడ కూలిన ఘటనలో 10 వేల మంది భక్తులు చిక్కుకుపోయారు. ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో ప్రమాదం సంభవించింది. కూలిన కొండ చరియలను తొలగించాలంటే కనీసం 3 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ బైక్ వెళ్లేందుకు చిన్న మార్గం ఉంది. అయితే బస్సు, కార్లు వంటి వాహనాలను వెళ్లేందుకు ఏ మాత్రం దారి లేదు. దీంతో 10 వేల మంది భక్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
చార్‌ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. ఇక తాజా ప్రమాదంతో చార్‌ధామ్ యాత్రా ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లను నిలిపి వేసినట్లు అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు హృషికేష్ రావొద్దని సూచనలు చేశారు. ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయిన భక్తులతో సత్రాలు, ధర్మశాలలు నిండిపోయాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.