కరోనా ఇప్పట్లో పూర్తిగా తొలగిపోయేలా కనిపించడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ వివిధ సబ్ వేరియంట్ల రూపంలో బెంబేలెత్తిస్తోంది. దేశంలో తొలిసారిగా బీఏ 4 వేరియంట్ కేసు హైదరాబాద్‌లో శుక్రవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే రెండో కేసు కూడా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో బీఏ 4 కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, మా సుబ్రమణియన్ శనివారం(మే 21)న ప్రకటించారు. ఈ వేరియంట్ ద్వారా ప్రభావితమైన వ్యక్తి చెన్నై నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగల్పట్టు జిల్లాలోని నవలూరు నివాసిగా తేలింది.
కోవిడ్-19 జీనోమ్ సీక్వెన్సింగ్ నెట్‌వర్క్ INSACOG తమిళనాడుకు చెందిన ఓమిక్రాన్ బీఏ4 సబ్-వేరియంట్ కేసును నిర్ధారించింది. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ రోజువారీ బులెటిన్ కీలక విషయాలను వెల్లడించారు. బీఏ 4 కేసులు వెలుగు చూసినంత మాత్రాన భయాందోళనలు అవసరం లేదని పేర్కొంది. కోవిడ్ రెండో డోస్ పొందిన వారికి కూడా కొత్త వేరియంట్లు సోకుతున్నాయని, అయితే టీకా పొందిన వారికి ప్రాణాపాయ ముప్పు తప్పుతుందని తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అంతా టీకా పొందాలని సూచించింది. బీఏ4 వేరియంట్ మొదటిసారిగా జనవరి 10, 2022న దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది. అప్పటి నుండి, ఇది అన్ని దక్షిణాఫ్రికాలోని అన్ని ప్రావిన్సులలో వెలుగు చూసింది. బీఏ 4, బీఏ 5 సోకిన వ్యక్తులకు వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండవు. అయితే ఈ ఉత్పరివర్తనాలపై జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.